Telangana: ఇవాళ, రేపు కూడా జాగ్రత్త.. వర్షంపై ఐఎండీ హెచ్చరిక

మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 8:54 AM IST
Telangana, heavy rain, weather report, imd,

Telangana: ఇవాళ, రేపు కూడా జాగ్రత్త.. వర్షంపై ఐఎండీ హెచ్చరిక 

తెలంగాణలో అకాల వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు వర్షం పడింది. దాంతో.. పలుచోట్ల ఈదురుగాలులకు కరెంటు వైర్లు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపోయి రోడ్లపై పడిపోయాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులంతా ఇబ్బంది పడ్డారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలకు కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు.

ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం, గురువారం కూడా వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.

హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షపాతం నమోదు అయ్యింది. మియాపూర్‌లో 13.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. కూకట్‌పల్లిలో 11.2 సెం.మీ, చందానగర్‌లో 10.7 సెం.మీ, యూసుఫ్‌గూడలో 9.4 సెం.మీ, ఆర్సీపురంలో 8.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మండే ఎండలో ఉదయం ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు.. సాయంత్రానికి వర్ష బీభత్సానికి తడుస్తూ.. వణుకుతూ వెళ్లారు. ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలోని రోడ్లు అయితే ఒక్కసారిగా కురిసిన వర్షానికి జలమయం అయ్యాయి. చెరువులను తలపించాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి వాన మెట్రో రైళ్లపై ప్రభావం చూపించింది. 20 నుంచి 30 నిమిషాల పాటు అధికారులు మెట్రో రైళ్లను నిలిపివేశారు.

Next Story