హెచ్చరిక.. తెలంగాణలో ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా శనివారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముసురేసింది.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 1:29 AM GMT
Telangana, heavy rain, weather, alert ,

 హెచ్చరిక.. తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా శనివారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముసురేసింది. ఉదయం మొదలైన ముసురు వాన రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. ఒక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ నేపథ్యంలోప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదివారం ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మలుుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా్ల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఇక శనివారం రాష్ట్రమంతా ముసురేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం వేంపల్లెలో 13.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో.. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు. ఈ క్రమంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Next Story