తెలంగాణకు మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణలో గత పది రోజులుగా ముసురు పడుతోంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 3:00 AM GMTతెలంగాణకు మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణలో గత పది రోజులుగా ముసురు పడుతోంది. కొన్ని చోట్ల మాత్రం వర్షాలు భారీగా పడుతున్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా నీరు వచ్చి చేరుతోంది. అయితే.. తెలంగాణకు వాతావరణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖతంలో అల్పపీడనం ఏర్పడిందనీ.. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. సాయంత్రానికి నగర వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలనీ.. చెట్ల ఉండొద్దని సూచించారు.