ఏప్రిల్ 6 తర్వాత తెలంగాణలో వర్షాలు: వాతావరణశాఖ
ఎండలు దంచి కొడుతున్న వేళ భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
By Srikanth Gundamalla
ఏప్రిల్ 6 తర్వాత తెలంగాణలో వర్షాలు: వాతావరణశాఖ
కొద్ది రోజులు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే చాలు భగభగ మండిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయ్యే సరికి కాలు బయటపెట్టలేని పరిస్థితులు. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదు అవుతున్నాయి. దాంతో.. ప్రజలు ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పలు చోట్ల పనులపై బయటకు వెళ్లిన వృద్ధులు ఎండ దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండ వేళ బయటకు రావొద్దనీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.
అయితే.. ఎండలు దంచి కొడుతున్న వేళ భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఏప్రిల్ 6వ తేదీ తర్వాత తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. వాతావరణశాఖ వార్తతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రెండ్రోజులు అయినా వాతావరణం కాస్త చల్లబడి చినుకులు పడితే బావుంటుందని అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణంకాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపారు. బుధవారం రోజున రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీల సెల్సీయస్‌కు చేరుకున్నట్లు చెప్పారు. ఇక ఎల్‌నినో కారణంగా తెలంగాణలోనే కాదు.. భారత్ అంతటా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.