Telangana: రాబోయే మూడ్రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
ఒక వైపు ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 9:09 AM ISTTelangana: రాబోయే మూడ్రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
భానుడు భగభగ మండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఏకంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మరో తొమ్మిది జిల్లాల్లో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండటంతో జనాలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఎండ వేడిమి కారణంగా బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఒక వైపు ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఏప్రిల్ 8వ తేదీన నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎండల వేడిమితో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ వర్షాలు పడతాయని చెప్పడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మూడ్రోజులు అయినా ఎండ నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.