తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురుని చెప్పింది.
By Srikanth Gundamalla
తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురుని చెప్పింది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ సహా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షం కారణంగా రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు అంతంత మాత్రంగా నమోదు అయ్యాయి. దాంతో.. ఎండల తీవ్ర నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లు అయ్యింది. మళ్లీ ఎండలు యథావిధిగా దంచేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుందని అంచనా వాతావరణ కేంద్రం వేసింది.
ఈ మేరకు వర్షాలు పడే ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ నెల 12వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్ం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మోస్తరు వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల జాబితాలో కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఉన్నాయి. ఈ జిల్లాల్లో బారీ వర్షాలు కురిసే అవకాశాలూ ఉన్నాయని చెప్పారు.
14న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 15వ తేదీన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.