మూడు రోజులపాటు వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌

Rain forecast for Telangana state for three days. తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక శనివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది.

By అంజి  Published on  9 Oct 2022 12:17 PM IST
మూడు రోజులపాటు వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక శనివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న రెండు రోజుల్లో నగరం అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడురోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు దిగువస్థాయిలో వీస్తున్నాయని చెప్పారు. తిరోగమనంలో ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 11 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.

హైదరాబాద్‌ నగరంలో శనివారం కురిసిన భారీ వర్షంతో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అత్తాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, మూసాపేట్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో అత్యధిక వర్షపాతం (46.3 మి.మీ), మాదాపూర్ (43.3 మి.మీ.) తర్వాతి స్థానంలో ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

మరోవైపు శనివారం కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా నిజామాబాద్‌లోని కోరట్‌పల్లిలో అత్యధికంగా 34.8మి.మీ, ఖమ్మంలోని ఖాన్‌పూర్‌లో 32.3మి.మీ వర్షపాతం నమోదైంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.


Next Story