6 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారనుంది. రానున్న ఆరు రోజుల పాటు అంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో...

By -  అంజి
Published on : 16 March 2026 8:03 AM IST

Telangana Weather Update March 16-21, AP Rain Forecast APSDMA, Yellow Alert in Telangana, Thunderstorms and Lightning Warning, Trough Effect on South India Weather

6 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ 

తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారనుంది. రానున్న ఆరు రోజుల పాటు అంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటమే ఈ మార్పులకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 21వ తేదీ వరకు ఎండల తీవ్రత కాస్త తగ్గి, ప్రజలకు ఉపశమనం లభించనుంది.

తెలంగాణలో వాతావరణ పరిస్థితి:

తెలంగాణలో సోమవారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు ప్రారంభం కానున్నాయి. మంగళ, బుధవారాల్లో ఇవి ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' (పసుపు రంగు హెచ్చరిక) జారీ చేసింది. 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ సమయంలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీలో రానున్న మూడు రోజుల పాటు విభిన్న వాతావరణం నెలకొననుంది. ఒకవైపు ఎండలు ఉండగానే, మరోవైపు ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి అనేక జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రజలకు సూచనలు:

ఆకస్మికంగా కురిసే వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ నిలబడరాదని హెచ్చరించారు. రైతులు తమ పంట కోతల విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

Next Story