ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం.
By Srikanth Gundamalla
ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆగస్టులో ఇప్పటి వరకు వర్షపాతాలు పెద్దగా నమోదు కాలేదు. అంతేకాక వేడి, ఉక్కపోతతో ప్రజలు కూడా కాస్త ఇబ్బందే పడ్డారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో.. ప్రజలకు ఉపశమనం కలిగినట్లు అయ్యింది. అల్పపీడన ప్రాంతంలోనే ఒక ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. సముద్ర మట్టాని 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని.. దాంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెబుతున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. మూడ్రోజుల పాటు సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.