ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. కానీ ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్‌గా బలపడింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 6:40 AM ISTఏపీకి తప్పిన తుపాను ముప్పు.. కానీ ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
తుపాను బంగ్లాదేశ్‌లో తీరం దాటింది. మొదటి నుంచి దీని ప్రభావం ఏపీపై పెద్దగా లేదనే చెప్పాలి. అయితే.. శ్రీలంక, అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగటిపూ ఎండలు దంచికొడుతుండగా.. రాత్రి వేళల్లో మాత్రం చలి తీవ్రంగా ఉంటోంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్‌గా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపరాకు సమీపంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.
వాతావరణ శాఖ చెప్పిన వివరాల మేరకు ఏపీలోని పలు జిల్లాల్లోమోస్తరు వర్షాలు పడే అవకశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావం ఏపీపై లేకపోయినా.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు.
ఏపీలో ఇప్పటికే వరిపంట కోతకు వచ్చింది. ముందుగా తుపాను ప్రభావం ఉంటుందని భయపడ్డారు. చివరకు అది తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకశాలు ఉండటంతో.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్ష ప్రభావం ఉండే ఆయా ప్రాంతాల రైతులను అధికారులు అప్రమత్తం చేసి.. కల్లాల్లో ఎండబోసిన పంటను కాపాడుకునేలా జాగ్రత్తలు చెబుతున్నారు. తేలికపాటి వర్షాలే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.