తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణశాఖ తెలిపింది.
By Srikanth Gundamalla Published on 8 Sep 2023 4:47 AM GMTతెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు అధికారులు. శుక్ర, శనివారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవగా..ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
గురువారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌లో నిన్న అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గురువారం ఉదయం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్‌లో భారీ వర్షం పడింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ జంట నగరాలతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 72.10 సెంటీమీటర్లు కాగా, నిన్నటికే 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది.