తెలంగాణకు అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
By Srikanth Gundamalla Published on 18 July 2023 11:14 AM ISTతెలంగాణకు అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఇప్పటికే చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా ఇదే రీతిలో అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలుజిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేం్దరం వెల్లడించింది. ఇక బుధవారం కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఆవర్తనం ప్రభావం వల్ల ఒడిశా-పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని తెలిపింది. దాంతోనే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది వాతావరణ కేంద్రం.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కుమ్రంభీం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు అయితే సాధారణ వర్షపాతం నమోదు అవుతోందని తెలిపారు. వాగులు, వంకలు ఉప్పొంగితే పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.