తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణశాఖ అలర్ట్
ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో..
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 4:26 AM GMTతెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణశాఖ అలర్ట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వానలు వచ్చేశాయి. జూన్ మొదటి వారంలో రావాల్సిన వర్షాలు చివరి వారంలో పడుతున్నాయి. కాస్త ఆలస్యమైనా వానలు పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. శనివారం, ఆదివారం ఈ రెండ్రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది వేసింది. వర్ష ప్రభావం ఎక్కువ ఉండే ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వర్షాలు పడే ప్రాంతాలకు హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115 మి.మీ నుంచి 204 మి.మీల వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. ఇక మరో ఏడు జిల్లాల్లో 65 మి.మీ నుంచి 115 మి.మీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపలో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతోనే తెలంగాణలోని ఆయా జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. కాగా.. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటిని నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం వరకు విస్తరించాయి. మెదక్, సంగారడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు ఆదిలాబాద్లోనూ కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఈ ఆదివారం నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.