అలర్ట్.. హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా మారింది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 2:30 AM GMTబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా మారింది. దీని ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండానికి తోడుగా మరో రుతుపవన ద్రోణి కూడా ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో శనివారం అర్ధరాత్రి నుంచే వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ముసురు కమ్మేసుకుంది. నిరంతరాయం వాన చినుకులు పడుతున్నాయి. దాంతో.. నగర ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. నగరంలో రాత్రి వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. అధికారులు.. సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా..తెలంగాణలో శుక్రవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4.2 సెం.మీ వర్షపాతం, దుగ్గొండిలో 4 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇవాళ జయశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే.. ఆదివారం నిజామాబాద్, సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడింది.