ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని...
By - అంజి |
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం (జి) కోర్లాం 59.5 మిమీ, అనకాపల్లి(జి) బుచ్చయ్యపేటలో 55.2మిమీ, రాజంలో 47మిమీ, కె.కోటపాడులో 21.2మిమీ, చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.
అటు తెలంగాణలో రాష్ట్రంలో సైతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి.