తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 36 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ...
By - అంజి |
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 36 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు అవకాశం ఉందన్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం,తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.