తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలుచోట్ల వడగండ్ల వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు వానలు పడతాయని తెలిపింది.
By అంజి
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలుచోట్ల వడగండ్ల వానలు
అమరావతి: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుముదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. నేడు శ్రీకాకుళం (జిల్లా)-6, విజయనగరం(జిల్లా)-5, పార్వతీపురంమన్యం(జిల్లా)-11, అల్లూరి సీతారామరాజు(జిల్లా)-5, కాకినాడ-1, తూర్పుగోదావరి-2 మండలాల్లో(30) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.గురువారం 47 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశంది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.