తీవ్ర తుఫానుగా మాండూస్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు
Mandous Cyclone to intensify into severe cyclonic storm.బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ మరింత బలపడి
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 9:05 AM ISTబంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతానికి చెన్నైకి 440కి.మీ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని, శుక్రవారం అర్థరాత్రికి పుదుచ్చేరి, మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరందాటే సమయంలో గంటకు 65- 85 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలపై తుఫాను ప్రభావం పడనుంది.
తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో చైన్నైతో పాటు దాని మూడు పొరుగు జిల్లాలు, కడలూరుతో సహా 10 జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, స్టేట్ ఫోర్స్ నుంచి దాదాపు 400 మంది సిబ్బందితో కూడిన 12 బృందాలను మోహరించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం 24 జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.