రుతుపవనాలు ముందే వచ్చినా..20 శాతం తక్కువ వర్షపాతం: IMD
ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి త్వరగానే ప్రవేశించాయి.
By Srikanth Gundamalla
రుతుపవనాలు ముందే వచ్చినా..20 శాతం తక్కువ వర్షపాతం: IMD
ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి త్వరగానే ప్రవేశించాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ.. అలా జరగడం లేదు. జూన్ 12 నుంచి 18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దాంతో.. ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు వెల్లడించింది. సాధారణం కన్నా 20 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ అధికారులు చెప్పారు. దాంతో.. రుతుపవనాలు ముందే దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా.. రైతులకు ఎక్కువగా లాభం లేకపోయిందని చెబుతున్నారు.
మరోవైపు రానున్న 3-4 రోజుల్లో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, బీహార్, జార్ఖండ్‌లో పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య భారత్‌లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్ 1నుంచి భారత వాయువ్య ప్రాంతంలో సాధారణం కంటే 70శాతం తక్కువ, మధ్య భారత్‌లో సాధారణం కంటే 31శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే దక్షిణాదిలోసాధారణం కంటే 16శాతం అధికంగా నమోదు అయినట్లు వెల్లడించింది వాతావరణశాఖ. ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే 15శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.