మరో తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By - అంజి |
మరో తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందంది. ఈనెల 27-29 వరకు (గురు, శుక్ర, శని వారాల్లో) కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వరికోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలంది. ప్రజలు సమాచారం,అత్యవసర సహాయం కోసం ఏపీఎస్‌డీఎంఏ లోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070, 18004250101 సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అటు ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
అటు తెలంగాణలో కూడా ఈ నెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 -3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 -15 డిగ్రీలు ఉంటాయని తెలిపింది.