ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణపై ఐఎండీ ప్రకటన
భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సోమవారం నాటికి పూర్తిగా ముగిసిపోయినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది
By - Knakam Karthik |
ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించినట్లు ఐఎండీ ప్రకటన
భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు సోమవారం నాటికి పూర్తిగా ముగిసిపోయినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో గడిచిన గత రెండు రోజులుగా ఆగ్నేయ భారతంలో ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ వర్షపాతమైతే నమోదు కాలేదు. ఇక ఉత్తర భారతం నుంచి పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ప్రకటించింది. దాంతో రాబోయే మరో రెండు రోజులూ పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపింది.
ఈశాన్య రుతుపవనాలు గతేడాది అక్టోబరు 16వ తేదీన దక్షిణాదిలోకి ప్రవేశించాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈసారి అదనంగా 19 రోజులు రుతుపవనాలు కొనసాగాయి. అక్టోబరులో మొంథా, నవంబరులో దిత్వా తుపాన్ల ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలనేవి కురిశాయి. తుపాన్ల సమయంలో మినహా మిగిలిన రోజులలో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు.
ఈ సీజన్‌లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఇందులో రెండు తీవ్ర తుపాన్లు (మొంథా, శక్తి), మరో రెండు తుపాన్లు (సెన్యార్, దిత్వా)గా మరింత బలపడ్డాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో 374. మిల్లీమీటర్లు (సాధారణం కంటే 16 శాతం ఎక్కువ), రాయలసీమలో 314 మి.మీ. (సాధారణం కంటే 33 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం, పంజాబ్ మరియు దాని పొరుగు ప్రాంతాలలో తుఫాను ప్రసరణగా పనిచేస్తున్న పశ్చిమ అల్పపీడనం, దేశ వాయువ్య దిశలో ద్రోణిగా పనిచేస్తున్న మరొక పశ్చిమ అల్పపీడనం ఉంది. బుధవారం నాడు మూడవ, మరింత తీవ్రమైన పశ్చిమ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు వ్యవస్థల ప్రభావంతో, గురువారం మరియు శుక్రవారం కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలలో మరియు శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది.
ఇదే వాతావరణ వ్యవస్థలు గురువారం నుండి ఆదివారం వరకు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శుక్రవారం వరకు వాయువ్య మరియు మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.