హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో నాలుగు రోజులు కూడా..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.
By Srikanth Gundamalla
హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో నాలుగు రోజులు కూడా..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రే భారీ వర్షం పడటంతో నగరం మొత్తం తడిసి ముద్దయ్యింది. ఇక మంగళవారం ఉదయం కూడా నగరంలో మరోసారి భారీ వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో సూచన చేసింది. రానున్న 4 రోజుల పాటు ఇవే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది.
హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. గురువారం వరకు నగరంలో వానలు పడతాయని, ప్రధానంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని కూడా చెప్పింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సహాయక సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైన ఇబ్బందులు తలెత్తిత్తే వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు అందించనున్నారు.