బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాలు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2024 2:25 PM GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం,  భారీ వర్షాలు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి సమయానికి వర్షం ఎక్కువ కావడంతో వరద పోటెత్తింది. ఒక్కసారిగా నగరం మొత్తం తడిసిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే సహాయక చర్యలు అందించేందుకు సన్నద్ధం అయ్యారు.

ఉప్పల్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, తార్నాక, సికింద్రాబాద్‌, కంటోన్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడలో హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌ కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్‌, అల్వాల్‌, హకీంపేట్‌, చార్మినార్‌లో పాంత్రాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. దాంతో చాలా వరకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. మరోమారు వర్షాలు పడుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మన్యం,అల్లూరి,ఏలూరు,ఎన్టీఆర్, పల్నాడు,ప్రకాశం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,శ్రీసత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఉరుములతో మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండ్రోజుల పాటు వర్ష సూచనలు భారీగానే ఉన్నాయని చెప్పారు.

Next Story