తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల..
By - అంజి |
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5మిమీ, పెద్దకూరపాడులో 40.2మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ, కోనసీమ జిల్లా ముక్కములలో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
అటు నిన్న రాత్రి హైదరాబాద్ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. గంట వ్యవధిలో కురిసిన వర్షానికి వరద పోటెత్తింది. బౌద్ధనగర్‌లో అత్యధికంగా 12.1 సెంటీ మీటర్, జవహర్ నగర్‌లో 11.2 సెంటీమీటర్లు, ఉస్మానియా యూనివర్సిటీలో 10.1 సెంటీ మీటర్, మెట్టుగూడలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. ఆసిఫ్‌నగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారు.