భారతీయులకు ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఫసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్‌గా మారనుండటం నైరుతి రుతుపవనాలకు అనుకూలమన్నారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్య విస్తార వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. గత ఏడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్య అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం నిర్ణీత సమయం కంటే ముందుగానే సక్రియం కానున్నాయి.
ప్రతి సంవత్సరం జూన్-సెప్టెంబర్ మధ్య వర్షాకాలం ఉంటుంది. గతేడాది జూన్‌లో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. అయితే జూన్ 01, 2024లోపు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ శాఖ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మంచి రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. నైరుతి రాక, వర్షాల తీరుపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) త్వరలో తొలి అంచనా నివేదిక విడుదల చేయనుంది.