వాతావరణశాఖ అలర్ట్.. ఏపీకి మరో తుపాను ముప్పు
ఏపీతో పాటు.. తమిళనాడులోని చెన్నైలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 7:45 AM GMTవాతావరణశాఖ అలర్ట్.. ఏపీకి మరో తుపాను ముప్పు
ఏపీతో పాటు.. తమిళనాడులోని చెన్నైలో మిచౌంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలో పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగిపోవడంతో రైతుల పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ మరో అలర్ట్ జారీ చేసింది. మొన్నటి వరకు మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేస్తే.. ఇప్పుడు మరో తుపాను రాబోతుందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది.
మిచౌంగ్ తుపాను తర్వాత ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గిపోయాయి. చలి ప్రభావంతో జనాలు ఉదయం 8 దాటినా బయటకు రాలేకపోతున్నారు. కొన్ని చోట్ల అయితే పొగ మంచు కారణంగా దారులు కూడా కనబడటం లేదు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందన్న వార్త ఏపీలో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఉపరితల ఆవర్తనం వల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాల పైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రబావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు.. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతున్నాయని తెలుస్తోంది.