బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరోసారి వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మరోసారి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 1:15 AM GMTబంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరోసారి వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మరోసారి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో వర్షాలు మరోసారి పడతాయని చెబుతున్నారు. అయితే.. గత నాలుగు రోజులుగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కానీ.. శుక్రవారం మాత్రం ఈ వానలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈ నెల 15న వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలతో రైతులకు కాస్త ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నారు.
ఏపీలో శనివారం కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదు అయ్యింది. చిత్తూరు జిల్లా నగరిలో 2.2 సెం.మీ వర్షపాతం, నెల్లూరు 1.4 వర్షపాతం, కర్నూలు జిల్లా ఆలూరులో 1.4 సెం.మీ, కర్నూలు జిల్లా హోలుగుండలో 1.2, తిరుపతిలో 1.0 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
నాలుగు రోజుల క్రితం ఏపీలో భారీ వర్షాలు కురవడంతో 10 సెం.మీ వరకు వర్షపాతం నమోదు అయ్యింది. దాంతో.. కొన్నాళ్లపాటు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో ఈ వానలు రైతులకు ఉపశమనం కల్పించాయి. ఎండ, ఉక్కపోత నుంచి కూడా జనాలకు ఉపశమనం లభించింది. మరోసారి అల్పపీడనం ఏర్పడుతుందన్న చల్లని కబురుతో ఏపీ రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.