ఆదివారం ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
జూన్ నెల దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla
ఆదివారం ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
జూన్ నెల దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు భారత వాతావరణశాఖ ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికే తీరాన్ని తాకుతాయని చెప్పడంతో ప్రజలంతా ఆనందంలో ఉన్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతుండంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది.
కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ క్రమంలోనే రైతులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది శనివారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, బంగాల్ మధ్య తీరం దాటుందని చెబుతోంది. ఈ తుపాను కారణంగా ఆదివారం మోస్తారు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేమాల్ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా లేదని.. ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.