బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీని గత కొద్ది రోజులుగా వరుణుడు విడిచిపెట్టడం లేదు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 7:09 AM ISTఏపీని గత కొద్ది రోజులుగా వరుణుడు విడిచిపెట్టడం లేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. అలాగే.. తెలంగాణ, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కూడా అలర్ట్ చేశారు. మంగళవారం ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణవాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు సూచించారు. మత్స్యకారులు బుధవారం వరకూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సముద్రంలో అలజడి ఎక్కువగా ఉంటుందని.. ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని చెప్పారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతోంది. శ్రీకాకుళం జిల్లా కవిటిలో అత్యధికంగా 6.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉద్ధృతికి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది.