బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఏపీకి తప్పని వర్షం ముప్పు
ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 8:15 AM ISTఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలతో జనాలను తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. స్వయంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగారు. అర్ధరాత్రి దాటే వరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చాలాచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వానలతో ప్రజలు వణికిపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడుతాయని అనుకునే లోపే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో తుఫాన్ రాబోతుందనీ.. ఏపీలో వర్షాలు పడబోతున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.అది తుపానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనంపై మరో రెండర్రోజుల్లో కచ్చితమైన సమాచారం తెలుస్తుందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.
కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరకొస్తా, దక్షిణ ఒరిస్సా ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాలను ఆనుకోని కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందన్నారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.