ఈ నెల 20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బంగాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని, ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతిలోని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.
ఈ కారణంగా ఇవాళ, రేపు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఇంకొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఉత్తర కోస్తా, యానాంలోని ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఈ వర్షాల తీవ్రత మరో 24 గంటల్లో తేలిపోనుంది. ఇదిలావుండగా.. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని సమాచారం.