నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

By సుభాష్  Published on  12 Sept 2020 11:15 AM IST
నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళఖాతాంలో అల్పడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతాయని వెల్లడించింది. అదే విధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

నిన్న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే అల్పపీడనం కారణంగా తూర్పు కర్ణాటక తీరం – అరేబియా సముద్రం మీద తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్నాం, మేఘాలయలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

విశాఖ జిల్లాకు పిడుగుల హెచ్చరిక

కాగా, ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తుంటే.. మరో వైపు పిడుగుపాటు హెచ్చరిక మరింత భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖ జిల్లాకు పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది విపత్తు నిర్వహణ శాఖ. అరకులోయ, అనంతగిరి, జి. మాడుగుల, చింతపల్లె, రావికమతం, రోలుగుంట, కొయ్యూరులో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story