తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం

By సుభాష్  Published on  10 Oct 2020 10:03 AM GMT
తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు వాయుగుండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్లు పేర్కొంది. శని, ఆదివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఆగ్నేయం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని ఆమె వివరించింది.

ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 14న మధ్య, పశ్చిమ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శుక్రవారం తెలంగాణలోని నిజామాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో భారీ వర్షం కురినట్లు తెలిపారు. అలాగే ఏపీలోని కృష్ణా,గుంటూరు, ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యారు. ఓ సెల్లర్‌లో నీరు పూర్తిగా నిండిపోవడంతో ఒకరు మృతి చెందారు. నగరంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని ద్విచక్ర వాహనాలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాల్లోకి భారీగా వరదనీరు రావడంతో నానా అవస్థలకు గురయ్యారు.

Next Story