తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం..భయం గుప్పిట్లో ప్రజలు
By రాణి Published on 6 April 2020 5:52 PM IST
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఉన్నట్లుండి మారిపోయింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ ఠారెత్తే ఎండ వేసింది. ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి, ఈదురు గాలులు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. మండు వేసవిలో కాస్త వాతావరణం చల్లబడితే సేద తీరుతారు కానీ..కరోనా కారణంగా చల్లటి వాతావరణం అంటేనే ఆందోళన చెందుతున్నారు. మారిన వాతావరణం కారణంగా కరోనా ఎక్కడ విజృంభిస్తుందోనని భయపడుతున్నారు ప్రజలు. మరోవైపు అన్నదాతలదీ ఇదే పరిస్థితి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతన్నను ముంచేస్తోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పడటంతో ఇప్పటికే మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల మామిడి తోటల్లోనే మగ్గుతోంది. ఎగుమతి చేసే ఆస్కారం లేదు. దీంతో రైతు దిగాలు చెందుతున్నాడు. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.
Also Read : అద్దెకారులో ఒకరి తర్వాత ఒకరు..దుస్తులు లేకుండానే..
రానున్న 10 రోజులు అత్యంత కీలకమని, ఈ 10 రోజుల్లో ప్రజలు వైరస్ బారిన పడకుండా సరైన జాగ్రత్తలు పాటించకపోతే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు. తెలంగాణలో 334, ఏపీలో 226 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా 4067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగితే..ఇండియాలో కరోనా మూడో స్టేజికి వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read :రాష్ట్రాలకు మరో రూ.3000 కోట్లు