ముఖ్యాంశాలు

  • తంగడపల్లి మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
  • పెళ్లిచేసుకోమన్నందుకు ఘాతుకం

దిశ హత్యోదంతం తర్వాత హైదరాబాద్ నగర శివార్లలో తీవ్ర సంచలనం రేపింది తంగడపల్లి మహిళ హత్య కేసు. గత నెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి పై వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన కొందరు..పోలీసులకు సమాచారమిచ్చారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి అనుమానాస్పద హత్యకేసుగా నమోదు చేసుకున్నారు. అయితే ఆ మహిళ శరీర రంగుని బట్టి ఆమె ఈ ప్రాంతానికి చెందినది కాదని భావించారు. తాజాగా..ఆ మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. తనను పెళ్లి చేసుకోమని ప్రియుడిపై ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఆమె పై ఇద్దరు వ్యక్తులు ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి..గుట్టుచప్పుడు కాకుండా కారులో తీసుకొచ్చి పై వంతెన కింద పడేసి పోయినట్లుగా సైబరాబాద్ పోలీసులు ప్రాథమిక నిర్థారణకొచ్చారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా..మరో కీలక నిందితుడి కోసం ప్రత్యేక బృందం ముంబైతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Also Read : ప్రియమైన కోడలికి కృతజ్ఞతలు చిరంజీవి

కాగా..మృతురాలికి వివాహం కాకముందు నుంచే ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడితో ప్రేమాయణం నడిచినట్లు గుర్తించారు పోలీసులు. ఆమెకు పెళ్లయ్యాక కూడా వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. దీంతో ఆమె పెళ్లి చేసుకుని.. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పటికే అతను మరో అమ్మాయికి దగ్గరవ్వడంతో మాజీని పక్కన పెట్టాడు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలని తలచి స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లుగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు వెల్లడించినట్లు సమాచారం.

పథకం ప్రకారం మహిళను లాంగ్ డ్రైవ్ పేరుతో కారెక్కించుకున్న ఇద్దరు యువకులు..కొంతదూరం వెళ్లాక ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ గొంతునులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై బట్టలు లేకుండానే మృతదేహాన్ని తంగడపల్లి పై వంతెన నుంచి కిందికి దింపి..గంటపాటు అక్కడే ఉన్నారు. అంతేకాక..ఆ మహిళ తలపై మోదిన బండరాయిని కూడా తమవెంటనే తీసుకెళ్లారు. నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్ ద్వారానే అసలు నిందితులెవరో తెలుసుకోగలిగారు. మృతరాలిని పడేసిన ప్రాంతం నుంచి ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు దొరికితే మృతురాలి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసే అవకాశాలున్నాయి.

Also Read :లాక్ డౌన్ ఎత్తివేతతో ఉద్యోగాలు ఊడనున్నాయా ?

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.