పెంపుడు కుక్కలు తెలుసు.. వీధి కుక్కలు తెలుసు.. ఈ నీటి కుక్కలు ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇవి ఎక్కువగా నీటిలోనే సంచరిస్తుంటాయి. నదుల్లో మనుగడ సాగించే అత్యంత అరుదైన మృదువైన నీటికుక్కలు(స్మూత్‌ ఇండియన్‌ ఆటర్స్‌) ఇవి.  మృదువైన చర్మంతో పాటు  పదునైన పళ్లు కలిగిఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్కడ కనిపిస్తాయి.. ఇవన్నీ గుంపులుగా సంచరిస్తాయి.  2019 సెప్టెంబర్‌లో కృష్ణాకు వరదలు వచ్చినప్పుడు కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేశాయి. భారీ వేగంతో ఎగువ నుండి నీరు విడుదల అవ్వటంతో నీటి కుక్కలు సందడి చూపరులను ఆకట్టుకుంది. దీంతో సందర్శకులు వీటిని తమ కెమెరాలు, సెల్‌ఫోన్‌లలో బందించారు. తాజాగా ఇవి జగిత్యాల జిల్లా మేట్‌పల్లి మండలం వేంపేట పెద్దచెరువు, పెద్దవాగులో పదుల సంఖ్యలో కనిపించాయి.

ఎక్కువగా ఈ నీటి కుక్కలు నదుల్లోనే సంచరిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇవి చెరువుల్లో కనిపించటంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గోదావరి దిగువన 90ఎకరాల్లో ఉన్న వేంపేట పెద్దచెరువులో నీరు పుష్కలంగా ఉంది. గోదావరిలో వాటి సంతతి పెరుగడంతో అక్కడి నుంచి పొలాల మీదుగా పెద్దవాగులోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఇవి నీటిలో స్వేచ్ఛగా విన్యాసాలు చేస్తుండటంతో స్థానికులు వింత జంతువులుగా భావించారు. తరువాత తెలుసుకొని అవి సేస్తున్న విన్యాసాలను చూసి కేరింతలు కొట్టారు.

నీటిలోనూ వేటాడగలవు.. భూమిపైనా వేటాడగలవు..

నీటి కుక్కలు నీటిలో చేపలను వేటాడుతూ జీవనం సాగిస్తుంటాయి. అవసరాన్ని బట్టి భూమిపై ఎలుకలు, బాతులు, కొంగలను ఇవి వేటాడగలవు. మృదువైన చర్మంతో, పదునైన పండ్లతో కనిపించే ఇవి ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. రెండున్నర మీటర్ల వరకు పొడవుండే నీటికుక్కల శాస్త్రీయ నామం లుధేరా. వీటి తోక దాదాపు మీటర్‌ ఉంటుంది. కృష్ణానది ప్రవహించే బీచుపల్లి, సోమశిలలోని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో, గోదావరి నదితోపాటు శివ్వారం అభయారణ్యం, మంజీరానదిలో అరుదుగా కనిపిస్తున్నాయి. నదుల్లో మనుగడ సాగిస్తున్న నీటికుక్కలు సమీపంలోని చెరువులకు వలస వచ్చి స్థావరాలను ఏర్పర్చుకుంటున్నాయి. ఇవి నీటి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. శుద్ధ జలాలున్నచోటే ఇవి మనుగడ సాగిస్తాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.