కోహ్లీతో సెల్ఫీ కావాలి అంటున్న విధ్వంసక ఓపెనర్ కూతుర్లు
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 7:08 PM ISTకరోనా వైరస్ ముప్పుతో పలు క్రీడలు వాయిదా పడగా.. మరికొన్ని క్రీడలు రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అనుకోకుండా లభించిన ఈ విరామాన్ని ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ .. అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన కుమారైల కోరిక మేరకు ఇటీవలే టిక్‌టాక్ లోకి ప్రవేశించిన ఈ విధ్వంసకర ఓపెనర్.. తన భార్య, పిల్లలతో కలిసి ఉన్న వీడియోలను పోస్టు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ సాంగ్ 'షిలాకీ జవాని' అంటూ.. డ్యాన్స్ చేసిన వార్నర్.. తాజాగా మరోసారి కూతుళ్లతో కలిసి ఓ లైవ్ వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. వీడియో చాట్‌లో భాగంగా వార్నర్ మాట్లాడుతున్న సమయంలో కూతుర్లు రావడంతో.. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని అడిగాడు.
విరాట్ కోహ్లీ తమ ఫేవరేట్ ఆటగాడని కూతుర్లు చెప్పారు. తరువాత తండ్రి వైపు తిరిగి చూస్తూ.. మా నాన్న కూడా మాకు ఫేవరేట్ ఆటగాడు అనడంతో.. వార్నర్ ముఖంలో ఆనందం వెల్లివెరిసింది. మరి కోహ్లీతో ఫోటో దిగడం ఇష్టమేనా అని ప్రశ్నించగా.. అవకాశం వస్తే కోహ్లీ అంకుల్‌తో సెల్ఫీ కావాలని అడుగతామని వార్నర్ కూతుర్లు.. ఐవీ-మే, ఇండి-రే లు చెప్పారు. ఇక వార్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువ ఉందని, కరోనా పూర్తి స్థాయిలో తగ్గితేగానీ క్రీడలు తిరిగి ప్రారంభంకావన్నాడు. ఖాళీ స్టేడియంలో మ్యాచులు ఆడటానికి తాను ఇష్టపడనని, ప్రేక్షకుల సమక్షంలో ఆడితే.. ఆ కిక్కే వేరు అని వార్నర్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.