సెహ్వా‌గ్‌కు అంత టాలెంట్ లేదు.. అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2020 10:49 AM GMT
సెహ్వా‌గ్‌కు అంత టాలెంట్ లేదు.. అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. నిత్యం ఏదో ఒక ర‌కంగా వార్తల్లో ఉండ‌డం ఈ పాక్ పేస‌ర్ కి అల‌వాటుగా మారింది. నిన్న‌టి వ‌ర‌కు భార‌త క్రికెట‌ర్ల‌ను ఆకాశానికి పొగిడిన ఈ రావ‌ల్పిండి ఎక్స్‌పెక్స్‌.. తాజాగా సెహ్వాగ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ బ్యాట్స్‌మెన్‌తో సెహ్వాగ్ ను పోలుస్తూ.. అత‌ని క‌న్నా త‌క్కువ టాలెంట్ ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త్ పై విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ బాదిన ఇమ్రాన్ న‌జీర్‌కు ఉన్న ప్ర‌తిభ వీరేంద్ర సెహ్వాగ్ లో లేద‌ని, ఇమ్రాన్ మంచి నైపుణ్యం క‌లిగిన ఆట‌గాడని అన్నాడు. ఆ సెంచ‌రీ త‌రువాత పాక్ టీమ్‌లో త‌న‌ను రెగ్యుల‌ర్‌గా అత‌డిని ఆడించాల‌ని తాను సూచించాన‌ని, కానీ త‌న మాట‌ను పాకిస్ఘాన్ క్రికెట్ బోర్డు ప‌ట్టించుకోలేద‌న్నాడు. త‌న మాట ప్ర‌కారం అత‌డిని ఆడించి ఉంటే.. అత‌డు ఓ గొప్ప క్రికెట‌ర్ అయ్యేవాడ‌ని తెలిపాడు. నజీర్‌ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడిని వదులుకోవాల్సి వచ్చింది. అన్ని షాట్లను కచ్చితంగా ఆడగల నజీర్‌లో మంచి ఫీల్డర్‌ కూడా ఉన్నాడని, కానీ వీరులా అత‌డు బుర్ర ఎక్కువ‌గా ఉప‌యోగించలేద‌న్నాడు.

ప్ర‌తిభావంతులు ఎదిగేలా పీసీబీ ప‌ట్టించుకోలేద‌ని అక్త‌ర్ విమ‌ర్శించాడు. మా ఆట‌గాళ్ల‌ను ర‌క్షించుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. లేకుంటే సెహ్వాగ్ క‌న్నా మెరుగైన ఆట‌గాడిని మేం న‌జీర్‌లో చూసేవాళ్లం. ఇమ్రాన్ న‌జీర్ ఎప్పుడైన బాగా ఆడాడంటే.. అది జావెద్ మియాందాద్ వ‌ల్ల‌నే. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి సూచనలు ఇచ్చేవాడు. చెత్త షాట్ ఆడినప్పుడల్లా జావేద్ భాయ్ అతనికి సందేశం పంపేవాడు' అని అక్తర్ చెప్పాడు.

ఇక పాక్ త‌రుపున న‌జీర్ 8 టెస్టులు ఆడి 427 ప‌రుగులు చేశాడు. 79 వ‌న్డేల్లో 1895ప‌రుగులు సాధించాడు. మ‌రోవైపు సెహ్వాగ్ భార‌త జ‌ట్టు త‌రుపున 104 టెస్టుల్లో 8,586 ప‌రుగులు, 251 వ‌న్డేల్లో 8273 ప‌రుగులు చేశాడు.

Next Story