వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పోలీసులు షాకిచ్చారు. పాదయాత్రకు అనుమతి రద్దు చేసి ఆమెను అరెస్ట్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నేడు(ఆదివారం) ఆమెను అరెస్ట్ చేశారు.
శనివారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధిని మరిచిపోయిన శంకర్‌నాయక్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు.