Warangal: అదనపు కట్నం వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్
వరంగల్‌లోని బ్యాంక్ కాలనీలో ఆదివారం ఓ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది.
By అంజి
మహిళా కానిస్టేబుల్ సూసైడ్ (ప్రతీకాత్మకచిత్రం)
మరికొద్ది నెలల్లో ఎస్సై కాబోతున్నాన్న కల తీరకుండానే ఆ మహిళా కానిస్టేబుల్ లోకాన్ని విడిచి వెళ్లింది. అదనపు కట్నం కోసం అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌లోని బ్యాంక్ కాలనీలో ఆదివారం ఓ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో నాంపెల్లి (26) మౌనిక పనిచేస్తోంది. మట్టెవాడ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎం సాయి ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం.. భార్య ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించిన భర్త శ్రీధర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
కాగా, అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తున్నాడని వడ్డేపల్లికి చెందిన మౌనిక తండ్రి రాజేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్త, భర్త, బావలు కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాజేందర్ ఆరోపించారు. దీంతో పోలీసులు శ్రీధర్‌పై ఐపీసీ సెక్షన్ల 498-ఏ, 304-బీ (వరకట్న మరణం) కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఏడేళ్ల క్రితం వివాహ సమయంలో శ్రీధర్‌కు ఐదు లక్షలు కట్నంగా ఇచ్చామని రాజేందర్ తెలిపారు. అయితే అదనపు కట్నం కోసం అతడు తమ కూతురిని వేధించాడని ఆరోపించారు.
If you need support, please reach out to the following helpline numbers: Call- 9152987821, AASRA-9820466726, Roshni Trust- 040-66202000.