వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మోత్యా తండాలో జాతర జరగుతుంది. ఈ క్రమంలో పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ తెగింది. దాంతో.. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు చనిపోయారు. ఇదే సంఘటనలో మూడేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీని గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అయితే.. జాతర ఏర్పాట్లలో భాగంగా టెంట్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పెద్ద కర్ర విద్యుత్ వైర్లకు తగిలి.. అవి తెగిపోయి కిందపడ్డాయి. అవి అక్కడే ఉన్నవారికి తగిలాయి. దాంతో. ముగ్గురు మృతి చెందారు. మృతులు భూక్య రవి, బానోతు సునీల్, గగులోతు దేవేందర్‌లుగా పోలీసులు గుర్తించారు. దేవేందర్ ఘటనాస్థలిలోనే చనిపోగా.. రవి, సునీల్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జాతర వేళ గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి. ఇక ఇదే ప్రమాదంలో రవి, సునీల్, జశ్వంత్, ఈర్యకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.