Warangal: వైద్య విద్యార్థిని ప్రీతి మృతి.. రూ.30 లక్షల పరిహారం
ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందింది.
By అంజి Published on 27 Feb 2023 7:24 AM ISTప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందింది. "స్పెషలిస్ట్ డాక్టర్ల మల్టీడిసిప్లినరీ బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు." నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు.
ఐదు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి కన్నుమూసింది. ఆమెను ఐదు రోజుల పాటు వెంటిలేషన్ మీద ఉంచారు. ప్రీతికి 72 గంటల పాటు ఎక్మో సిస్టమ్ ద్వారా వైద్యం అందించిన వైద్యులు.. నిన్న రాత్రి ఎక్మో సిస్టమ్‌ను తొలగించారు. గత ఐదు రోజులుగా ప్రీతి శరీరంలో ఎలాంటి చలనం, మార్పు లేదని, బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయ్యిందని, మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ప్రీతి మృతదేహాన్ని ఎక్మో సిస్టిమ్, వెంటిలేషన్ నుంచి షిఫ్ట్ చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కన్నబిడ్డను కాపాడుకోలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్థీషియా విభాగంలో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) చదువుతున్న ధరవతి ప్రీతి బుధవారం నాడు సీనియర్ వేధింపుల కారణంగా తన జీవితాన్ని ముగించుకునేందుకు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో, డాక్టర్ ప్రీతిని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి తీసుకొచ్చారు. వరంగల్ పోలీసులు సీనియర్‌పై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడైన మహ్మద్ సైఫ్‌పై శుక్రవారం వరంగల్ జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) బోనాల కిషన్ తెలిపారు. కేఎంసీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాత్రి నిమ్స్‌ను సందర్శించి విద్యార్థిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమిళిసై ప్రీతి కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ వైద్య విద్యార్థికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ప్రీతి ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
శుక్రవారం కరీంనగర్‌లో లవ్ జిహాద్ వల్లే వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పీజీ వైద్య విద్యార్థిని డి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో వాట్సాప్ చాట్‌లను విశ్లేషించామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తెలిపారు. డాక్టర్ ప్రీతిని అవమానించేందుకే నిందితుడు మహ్మద్ సైఫ్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడ్డాడని వాట్సాప్ చాట్‌లను అధికారులు విశ్లేషించారని ఆయన చెప్పారు.
ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారని, రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.