వరంగల్ నగరంలోని ఓ బార్‌లో మందుబాబు హల్ చల్ చేశాడు. రౌడీయిజం చూపిస్తూ.. తల్వార్‌తో బెదిరింపులకు దిగాడు. అఖిల బార్‌లో ముక్కెర మధు తల్వార్‌తో బెదిరింపులకు దిగడంతో బార్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పీకలదాకా మద్యం సేవించిన మధు.. తనకు ఫ్రీగా ఫుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తే.. బాటిల్ ఇస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన మధు కాసేపటికి తల్వార్‌తో వచ్చి క్యాషియర్‌ని చంపుతానని బెదిరించాడు. క్యాషియర్ రంజిత్ పోలీసులకు విషయం తెలియజేయడంతో పోలీసులు.. అక్కడకు చేరుకుని మధును అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆటో డ్రైవర్‌గా పని చేసిన మధు.. ప్రస్తుతం కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు.
తనకు ఉచితంగా మద్యం అందించాలని బార్ సిబ్బందికి కత్తి చూపించి బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), ఆయుధాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ''ముక్కెర మధు అనే వ్యక్తి ఆగస్టు 25న ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్‌లోకి ప్రవేశించి, బార్ సిబ్బందిని కత్తి చూపించి మద్యం అందించమని కోరాడు. బార్ సిబ్బందిని కూడా బెదిరించాడు. మద్యం సీసా చోరీకి ప్రయత్నించాడు'' అని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. “బార్ యజమాని ఫిర్యాదుపై, ఆయుధ చట్టం, ఐపిసిలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోంది”అని పోలీసు అధికారి తెలిపారు.