Warangal: ప్రేమ పెళ్లి చేశారని.. ఇళ్లు తగలబెట్టించిన తండ్రి

కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన ఓ తండ్రి.. బీభత్సం సృష్టించాడు. కూతురిని పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటికి నిప్పు పెట్టాడు.

By అంజి  Published on  5 July 2023 3:17 PM IST
Warangal, Destroys Friends Houses , Narsampet, Love marriage

Warangal: ప్రేమ పెళ్లి చేశారని.. ఇళ్లు తగలబెట్టించిన తండ్రి

కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన ఓ తండ్రి.. బీభత్సం సృష్టించాడు. కూతురిని పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు, పెళ్లిని దగ్గరుండి చేశారన్న నెపంతో యువకుడి స్నేహితులపై దాడి చేసి, వారి ఇంటికి నిప్పు పెట్టాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇటుకాలపల్లి గ్రామ సర్పంచ్‌ మండల రవీందర్‌ కూతురు కావ్య శ్రీ, అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్‌ కొన్నాళ్లుగా ప్రేమాయాణం చేశారు. హసన్‌పర్తి మండల పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న కావ్య.. ఇంట్లో వారితో చెప్పకుండా రంజిత్‌ వెళ్లి లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంది.

ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు.. హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నూతన దంపతులను పోలీస్‌స్టేషన్‌ పిలిపించి మాట్లాడారు. తిరిగి ఇంటికి రావాలని కూతురిని తండ్రి రవీందర్‌ ఎంతగానో బతిలాడు. ఆమె వచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సర్పంచ్‌ రవీందర్‌, తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి రంజిత్‌ ఇంటిపై దాడి చేశాడు. అలాగే లవ్‌ మ్యారేజ్‌ సహకరించారని రంజిత్‌ స్నేహితులపై దౌర్జన్యం చేసి, వారి ఇళ్లకు నిప్పు పెట్టాడు. దీంతో ఇళ్లలో ఉన్న వారందరూ భయంతో బయటకు పరుగులు తీశారు.

సర్పంచ్‌ వ్యవహరించిన తీరుతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎలాంటి గొడవలు జరగకుండా గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లిని తన ఇష్టపూర్తిగానే చేసుకున్నట్లు కావ్య శ్రీ తెలిపింది. తనను ఎవరూ ఇబ్బందులకు గురిచేయలేదని, తన వల్ల ఇబ్బంది పడొద్దని, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు తెలుపుతూ కావ్య శ్రీ ఓ వీడియో విడుదల చేసింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన కోసం ఎక్కడా వెతకొద్దని కోరింది.

Next Story