సమ్మక్క-సారలమ్మ జాతరకు నిధుల విడుదల
TS Government Released 75 crores to Medaram Jathara.ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 9:22 AM GMT
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ప్రారంభంకానున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు జాతరను నిర్వహించనున్నారు. జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్లాస్టిక్ రహితంగా జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ జాతరకు రూ.75 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు గిరిజనులు, ఆదివాసీల పక్షాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సీఎం కేసిఆర్ కి ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. మేడారంలో భక్తుల కోసం ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో ఏర్పాట్లు చేపట్టామన్నారు. జాతర కోసం వారం రోజుల కిందటే రూ.2.24 కోట్ల వ్యయంతో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఓహెచ్‌ఆర్‌ఎస్, కమ్యూనిటీ డైనింగ్ హాలు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన వసతులన్నీ డిసెంబరులోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని.. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలతో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.