తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మేడారం జాతర ఈ నెల 16 (బుధవారం) ప్రారంభమైంది. బుధవారం రాత్రి సారక్క గద్దెపైకి చేరగా.. గురువారం రాత్రి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపుగా గద్దెపైకి తీసుకువచ్చారు. సమ్మక్క ఊరేంగిపు చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సమ్మక్క ఆగమన సమయంలో పోలీసులు భక్తులను క్యూ లైన్‌లో గంటల తరబడి వేచి ఉంచారు.
సమ్మక్క తల్లి గద్దెపై చేరిన తరువాత ఒక్కసారిగా భక్తులను వదిలి వేయగా తోపులాట జరిగింది. ఇద్దరు భక్తులు అందులో చిక్కుకున్నారు. పోలీసులు గుర్తించి ప్రథమ చికిత్స అందించే లోపే ఆ ఇద్దరు మృతి చెందారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీలకు ఇచ్చిన ప్రియారిటీ సామాన్య భక్తుల క్యూ లైన్‌లో ఎందుకు ఇవ్వడం లేదని పోలీసుల పై భక్తులు మండిపడుతున్నారు. కాగా.. క్యూ లైన్‌లో భద్రత వైఫల్యంపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.