మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలి : రేవంత్ రెడ్డి
TPCC President Revanth Reddy Visits Medaram Jatara.నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2022 2:59 PM ISTనాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తోంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. వనదేవతర జాతరకు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు వన దేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతర వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాల వద్దకు ప్రధాని, సీఎం వెలుతారన్నారు. సమ్మక్క-సారలమ్మను అవమానించే అధికారం సీఎం, ప్రధానికి ఎవరిచ్చారని అన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ గా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్లతో శాశ్వత పర్యాట కేంద్రంగా మేడారాన్ని అభివృద్ది చేయాలన్నారు. కుంభమేళా మాదిరిగానే మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.