తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దొంగిలించి ఓ దొంగ బావిలో పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దొంగ ఆ రాత్రంతా బావిలోనే గడపవలసి వచ్చింది. స్థానిక నివాసితులు అప్రమత్తం చేయడంతో ఇవాళ పోలీసులు అతన్ని రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో దొంగతనానికి పాల్పడిన దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
అతను రాత్రి బావిలో గడపవలసి వచ్చింది. మరుసటి రోజు ఉదయం సహాయం కోసం అతని కేకలు విన్న స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. తాడు సహాయంతో అతడిని బయటకు తీశారు. హాస్టల్‌లో నాలుగు సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు దొంగిలించి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డానని ఆ వ్యక్తి అంగీకరించాడు. మూడు రోజుల్లో 14 సెల్‌ఫోన్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు చోరీకి పాల్పడినట్లు పోలీసుల తదుపరి విచారణలో తేలింది. చోరీలు జరుగుతున్నా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదని, తమకు సరైన భద్రత కల్పించలేదని విద్యార్థులు ఆరోపించారు.