వరంగల్ నిట్‌లో స్వైన్ ఫ్లూ కలకలం

Swine flu stir in Warangal nit. వరంగల్‌ నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. నగరంలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో ఓ విద్యార్థికి స్వైన్ ఫ్లూ పాజిటివ్​గా

By అంజి  Published on  25 Sept 2022 1:50 PM IST
వరంగల్ నిట్‌లో స్వైన్ ఫ్లూ కలకలం

వరంగల్‌ నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. నగరంలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో ఓ విద్యార్థికి స్వైన్ ఫ్లూ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. కాలేజీకి చెందిన ఓ​ బీటెక్‌ విద్యార్థికి జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే విద్యార్థిని శుక్రవారం రాత్రి హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు వెంటనే పరీక్షలు చేశారు. హెచ్‌1ఎన్‌1 టెస్టులు నిర్వహించగా.. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ విషయాన్ని వైద్యులు వెంటనే జిల్లా వైద్యశాఖ అధికారులకు చెప్పారు.

జిల్లా ప్రభుత్వ అధికారులు మున్సిపల్ శాఖకు వెంటనే సమాచారం అందించారు. దీంతో నిట్​లోని విద్యార్థి తరగతి గది, హాస్టల్ పరిసరాల్లో మున్సిపల్‌ సిబ్బంది శానిటేషన్ చేయించారు. వైద్యశాఖ అధికారులు నిట్ డిస్పెన్సరీలో వివరాలు సేకరించారు. స్వైన్​ ఫ్లూ బారినపడ్డ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాలేజీలో ఇతర విద్యార్థులకు ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో వివరాలను సేకరించారు. స్వైన్‌ ఫ్లూ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.

ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో ఆరేళ్ల చిన్నారితో పాటు 39 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ జ్వరం, ఇతర లక్షణాలతో ఈ ఇద్దరు చేరారు. కానీ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారిని హైదరాబాద్ పంపించారు. అక్కడ కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. హైదరాబాద్ లో చికిత్స అనంతరం జిల్లా కేంద్రానికి వచ్చినట్లు సమాచారం.

Next Story