వరంగల్ ఎంజీఎంలో దారుణం.. ఐసీయూలో రోగిని కొరికిన ఎలుకలు.. నాలుగు రోజుల్లో రెండు సార్లు
Rats Biting The Patient Leg and fingers at ICU in Waramgal MGM hospital.వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటు
By తోట వంశీ కుమార్ Published on 31 March 2022 7:57 AM GMTవరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికివేశాయి. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. దీనిపై అతడి బంధువులు మండిపడుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ కే ఇలా జరిగితే.. మిగతా రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆస్పత్రిలో జాయిన్ అయిన తొలి రోజే అతడి చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడంతో గాయాలకు కట్టుకట్టారు.
ఈ రోజు ఉదయం కూడా మరోసారి శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేశాయి. ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు. మడమ వద్ద ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్పందించిన వైద్యులు మళ్లీ కట్టు కట్టి చికిత్స అందించారు. శ్రీనివాస్‌కు రక్తస్రావం కావడంపై అతడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి ఆర్ఎంవో దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై రోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందే వ్యక్తిని వైద్యులు, సిబ్బంది నిత్యం కనిపెట్టుకుని ఉంటారు. అలాంటిది ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.